" ఈ రోజు పొద్దున లేవగానే అద్దం లో చూసుకుని భయపడ్డా!! "
" భలే వాడివే నీ మొహం నువ్వే చూసుకోలేక పోతే జనాలకేం చూపిస్తావోయ్? "
" మరదే! నేను భయపడింది అందుక్కాదు. నేనెవరో నాకే తెలీక! అందుకే అడిగింది నేనెవరో మీకు తెలుసా అని. "
" నువ్వేం చెప్పకుండా మాకెలా తెలుస్తుంది? "
" సరే ఐతే విను, పనీ పాట లేక బద్ధకం గా వుంటాను, పనిస్తే ఎంతైన చేసేస్తాను. నన్నెవడన్నా ఏమన్నా అంటే లైట్ తీసుకోగలను కానీ నా నమ్మకాలను దెబ్బతీస్తే వూరుకోను. నేను చూసిందే సత్యం విన్నదే వేదం అనుకునే మూర్ఖుణ్ణి కానీ నమ్మేలా ఎవడేం చెప్పినా నమ్మేస్తాను.
రాజకీయ నాయకులు వాళ్ళ కుళ్ళు అవినీతి గురించి బాధ పడుతూ వుంటాను నా దేశం ఏమైపోతోందో అని ఫీల్ వుతుంటాను కానీ అన్యాయాన్ని గట్టిగా ఎదురించలేను. కనీసం వోటు కూడా ధైర్యం గా సొంతం గా ఆలోచించి వెయ్యలేను తెలుసా.
పక్క దేశం వాడొచ్చి బాంబులేసి ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా మనుషుల్ని కాల్చేసి పోతుంటే హాపీ గా టీవీ లో షో చూసి మనసులో పెద్దగా పట్టించుకోక పోయినా, బయటికి చాలా ఫీలవుతా.
ఆ, టీవీ అంటే గుర్తొచ్చింది, పనికిమాలిన చానల్స్ అన్ని చూసి విసుగెత్తి ఏంటీ దరిద్రం మనకు అనుకుంటా కానీ దాని రిమోట్ మన చేతుల్లోనే వుందని మర్చిపోతుంటా. కనీస సామాజిక భాద్యతలేని మీడియా ని చూసి విమర్శిస్తూ తెగ ఫీలవుతా. న్యూస్ అంటే వాడిష్టమొచ్చిన వ్యూస్ అన్నట్టుగా ప్రేక్షకులకు విషాన్నెక్కిస్తున్నా కూడా టీవీ కట్టెయ్యలేక నన్ను నేను కొట్టుకోలేక తట్టుకోలేక బాధపడేవాడ్ని.. నేనెవరంటావ్??
సినిమాలు చూసి ఎంత మూసపోసినట్టున్నా జబ్బలు చరిచేసుకుని తెగ పొగిడేసి వందేసి రొజులు చూసేసి, అటు తిప్పి ఇటు తిప్పి చూపించే కథలనే మళ్ళి మళ్ళి హిట్లు చేసుకుని ఆనందపడుతున్న అల్పసంతోషిని. చిన్న చిన్న గ్రాఫిక్సులకే భారతీయ సినిమా ఎల్లలు దాటిందని కేరింతలేసే సాధారణ ప్రేక్షకుడ్ని, మన సినిమా ఇలా తగలడటానికి కారణం నేనేనన్న గ్న్యానం లేక ఆ సంగతి మనసులో తెలుస్తున్నా కూడా దాన్ని లోపల్లోపలే అదిమేసి కూచున్న హిపోక్రాట్ని.
వందకోట్లమందున్న దేశానికి ఆటలపోటీల్లో పతకాలు పదుల్లో కూడా ఎందుకురావని వాపోతూ నేను మటుకు పోటీ పరీక్షలకు పుస్తకాలు ముందేసుకుని కూచునే అసమర్థుడ్ని. దేశం ఎటుపోతోందో అని వెతుక్కుంటూ అలిసిపోయి విదేశీ కోలాలు తాగి సేదతీరే బాటసారిని. పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతిదాన్లోను సమస్యను వెతుక్కుంటూ పరిష్కారం లేదేమో అని భయపడుతూ నా తప్పులకు చేతకాని తనానికి పక్కోడిని భాద్యత చేస్తున్న రంధ్రాన్వేషిని. "
" ఇన్ని చెప్తున్నాను నేనొక కంప్లైంట్ బాక్స్ నేమో "
" కాదులేవయ్యా చుడ్డానికి మనిషిలానే వున్నావుగా. "
" నాదంటూ గిరిగీసుకుని బాక్స్ లో కూచుని బయటేం లేదు ఇదేనాప్రపంచం అనుకుంటున్ననేమో. బయటికి ఎందుకురాలేకపోతున్నా?? ఇంథకీ నేనెవర్ని ? "
" తస్సాదియ్యా కాస్త గుర్తొచ్చేందుకు హెల్ప్ చేద్దాం నీ గురించి చెప్పమంటే మా అందరి గురించి చెప్తావేంటి? "
25, జూన్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి