26, జూన్ 2009, శుక్రవారం

నా బ్లాగులో వ్యాఖ్యలు

నా బ్లాగు మొదలు పెట్టింది ఏదన్న కొత్తవిషయాలు తెలుసుకోడానికి, నాకు తెలిసిన కొన్ని పంచుకోడానికి. చర్చలు లేవనెత్తి చర్చల్లో పాల్గొని ఎంతోకొంత జ్ఞానం గడిద్దామని. ఇక్కడ వాదాలు సంవాదాలు వివాదాలు అన్ని ఆహ్వానమే. అభ్యంతరకరమైన భాష వాడనంతవరకు అభ్యంతర రీతిలో వున్న వ్యాఖ్యలు కూడా ప్రచురితమే. ఇంకాఏదన్న సలహాలు సంప్రదింపులు అన్ని ఇక్కడ అనుమతి పొందబడుతాయి. ఇక్కడ జరిగే ఏ రకమైనటువంటి వాదోపవాదానికైనా చట్టబద్ధంగా న్యాయబద్ధం గా నేనే భాద్యుడ్ని. ఇక్కడ ఎవరైనా ఎటువంటి ఐడెంటిటీతోనైనా వ్యాఖ్యానించచ్చు. ఎవ్వరి ఐడెంటిటీ వారి ప్రమేయం లేకుండా బయట పెట్టడం జరుగదు.

ఒకరి మీద ఎందుకింత ద్వేషం?

ద్వేషం, పగ, ప్రతీకారం .... ఎందుకివన్ని??

ఒకరి మీద లేక ఒక వర్గం మీద ఎందుకింత ద్వేషం కలుగుతుంది?
అమానవీయం గా ఎందుకు దాడి చెయ్యలనిపిస్తుంది?
ఇష్టం వచ్చినట్టు విమర్శలు ఎందుకు చెయ్యాలనిపిస్తుంది??

ఎవడిమీదన్నా ద్వేషం కలిగిందనుకోండి,వాడి టెంక పగలగొట్టేబదులు వాడ్నోసారి క్షమించి చూడండి... అని అంటాననుకున్నరా?
అస్సలంటే అస్సలు అనను!
వుండాలి!
ద్వేషం వుండాలి!!
నిన్నెవడన్నా ఎదన్నా అంటే వాడి పుచ్చె రేగ్గొట్టేంత ద్వేషం వుండాల్సిందే!!! తప్పేం లేదు.
కాకపోతే ఆ ద్వేషాన్ని కాస్త కన్స్ట్రక్టివ్ గా, ప్రొడక్టివ్ గా మార్చుకోండి.

అర్థం కాలేదా?

నువ్వొక రైల్లోనో బస్సులోనో పోతున్నావు. కండక్టర్ వచ్చి నిన్ను ఫలానా వర్గం వాడివి కాబట్టి ఇక్కడ కూచోనివ్వను అని, ఠాట్ కాదు కూడదు అన్నందుకు నిన్ను అందులోనుంచి గెంటివెసాడనుకో, వేంఠనే ఓ దుడ్డుకర్రుచ్చుకుని వాడి గుండు పగలగొట్టావనుకో.. ఏమవుతుంది??

నీ మీద కేసవుతుంది!!

నీ ద్వేషం చల్లరినా విషయం మటుకు చిరిగి చాటంతై చాపంతవుతుంది.
అదే నువ్వు ఆ ద్వేషాన్ని నీ ఆయుధం లాగా మార్చుకుని సహనం తో అహింసాయుతంగా పోరాటం సాగించావనుకో.. నీ సమస్యకొక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, నీ ద్వేషానికి ఒక అర్థం పరమార్థం వుంటుంది. నీ జన్మ చరితార్థం అవుతుంది.

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్నారొక పెద్దమనిషి. నిజమే!
కానీ ఆ పోరాటాన్ని నువ్వెలా కోనసాగిస్తావో, ఏ పంథాలో సాగుతావొ అన్నదాన్నిబట్టే నీ బానిస సంకెళ్ళు పోతాయో లేక ఇంకా జటిలమై వుక్కు సంకెళ్ళుగా మారుతాయో అన్నది ఆధారపడివుంటుంది.

కాబట్టి మై డియర్ ఫైటర్స్, గొడవపడేది చాక్లెట్టు కోసమైనా చట్టం కోసమైనా, కాస్త ఇంగిత జ్ఞ్యానం, విచక్షణతో ప్రవర్తిస్తే ఆ గొడవకొక సార్థకత లభిస్తుంది కదా.
ఏమంటారు?

25, జూన్ 2009, గురువారం

నేనెవరో మీకు తెలుసా??

" ఈ రోజు పొద్దున లేవగానే అద్దం లో చూసుకుని భయపడ్డా!! "

" భలే వాడివే నీ మొహం నువ్వే చూసుకోలేక పోతే జనాలకేం చూపిస్తావోయ్? "

" మరదే! నేను భయపడింది అందుక్కాదు. నేనెవరో నాకే తెలీక! అందుకే అడిగింది నేనెవరో మీకు తెలుసా అని. "

" నువ్వేం చెప్పకుండా మాకెలా తెలుస్తుంది? "

" సరే ఐతే విను, పనీ పాట లేక బద్ధకం గా వుంటాను, పనిస్తే ఎంతైన చేసేస్తాను. నన్నెవడన్నా ఏమన్నా అంటే లైట్ తీసుకోగలను కానీ నా నమ్మకాలను దెబ్బతీస్తే వూరుకోను. నేను చూసిందే సత్యం విన్నదే వేదం అనుకునే మూర్ఖుణ్ణి కానీ నమ్మేలా ఎవడేం చెప్పినా నమ్మేస్తాను.

రాజకీయ నాయకులు వాళ్ళ కుళ్ళు అవినీతి గురించి బాధ పడుతూ వుంటాను నా దేశం ఏమైపోతోందో అని ఫీల్ వుతుంటాను కానీ అన్యాయాన్ని గట్టిగా ఎదురించలేను. కనీసం వోటు కూడా ధైర్యం గా సొంతం గా ఆలోచించి వెయ్యలేను తెలుసా.

పక్క దేశం వాడొచ్చి బాంబులేసి ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా మనుషుల్ని కాల్చేసి పోతుంటే హాపీ గా టీవీ లో షో చూసి మనసులో పెద్దగా పట్టించుకోక పోయినా, బయటికి చాలా ఫీలవుతా.

ఆ, టీవీ అంటే గుర్తొచ్చింది, పనికిమాలిన చానల్స్ అన్ని చూసి విసుగెత్తి ఏంటీ దరిద్రం మనకు అనుకుంటా కానీ దాని రిమోట్ మన చేతుల్లోనే వుందని మర్చిపోతుంటా. కనీస సామాజిక భాద్యతలేని మీడియా ని చూసి విమర్శిస్తూ తెగ ఫీలవుతా. న్యూస్ అంటే వాడిష్టమొచ్చిన వ్యూస్ అన్నట్టుగా ప్రేక్షకులకు విషాన్నెక్కిస్తున్నా కూడా టీవీ కట్టెయ్యలేక నన్ను నేను కొట్టుకోలేక తట్టుకోలేక బాధపడేవాడ్ని.. నేనెవరంటావ్??

సినిమాలు చూసి ఎంత మూసపోసినట్టున్నా జబ్బలు చరిచేసుకుని తెగ పొగిడేసి వందేసి రొజులు చూసేసి, అటు తిప్పి ఇటు తిప్పి చూపించే కథలనే మళ్ళి మళ్ళి హిట్లు చేసుకుని ఆనందపడుతున్న అల్పసంతోషిని. చిన్న చిన్న గ్రాఫిక్సులకే భారతీయ సినిమా ఎల్లలు దాటిందని కేరింతలేసే సాధారణ ప్రేక్షకుడ్ని, మన సినిమా ఇలా తగలడటానికి కారణం నేనేనన్న గ్న్యానం లేక ఆ సంగతి మనసులో తెలుస్తున్నా కూడా దాన్ని లోపల్లోపలే అదిమేసి కూచున్న హిపోక్రాట్ని.

వందకోట్లమందున్న దేశానికి ఆటలపోటీల్లో పతకాలు పదుల్లో కూడా ఎందుకురావని వాపోతూ నేను మటుకు పోటీ పరీక్షలకు పుస్తకాలు ముందేసుకుని కూచునే అసమర్థుడ్ని. దేశం ఎటుపోతోందో అని వెతుక్కుంటూ అలిసిపోయి విదేశీ కోలాలు తాగి సేదతీరే బాటసారిని. పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతిదాన్లోను సమస్యను వెతుక్కుంటూ పరిష్కారం లేదేమో అని భయపడుతూ నా తప్పులకు చేతకాని తనానికి పక్కోడిని భాద్యత చేస్తున్న రంధ్రాన్వేషిని. "

" ఇన్ని చెప్తున్నాను నేనొక కంప్లైంట్ బాక్స్ నేమో "

" కాదులేవయ్యా చుడ్డానికి మనిషిలానే వున్నావుగా. "

" నాదంటూ గిరిగీసుకుని బాక్స్ లో కూచుని బయటేం లేదు ఇదేనాప్రపంచం అనుకుంటున్ననేమో. బయటికి ఎందుకురాలేకపోతున్నా?? ఇంథకీ నేనెవర్ని ? "

" తస్సాదియ్యా కాస్త గుర్తొచ్చేందుకు హెల్ప్ చేద్దాం నీ గురించి చెప్పమంటే మా అందరి గురించి చెప్తావేంటి? "

23, జూన్ 2009, మంగళవారం

బుల్లి బుర్రలో బోల్డన్ని డవుట్లు!! మీరే తీర్చాలి మరి.

క్రీస్తు శకం రెండువేలా ఏడవ సంవత్సరం, ఎండాకాలం! ఎండలకు బుర్రలో గుజ్జు ఆవిరైపోతుండగా.. ఎన్ని టెక్స్టు బుక్సు చదివినా నిద్రపట్టక ఉపసమనం కోసం ఠంఢ ఠంఢ కూల్ కూల్ నవరత్న తైలం తలకు మర్దించి తలమాసిన యాహూ లో లాగిన్ అయ్యి నాలాగే పనీ పాటా లేకుండా చాట్ చేస్తున్న మిత్రబృందాన్ని కెలికా. నా బాధ భరించలేక ఒకరు నాకు తోటరాముడి బ్లాగు లింక్ ఇచ్చారు. అదుగో అప్పట్నుంచి చిరపుంజి లో ఎడతెరిపిలేకుండా పడే వర్షం లాగా, సహారా ఎడారిలో ఆగకుండా వీచే వడగాలుల్లాగా విడవకుండా బ్లాగులు చదువుతూనేవున్నా.

వన్ ఫైన్ డే ఎందుకో మన రామోజి గారి మార్గదర్శి ఎత్తేసినా సరే మా వూళ్ళో వున్న లోకల్ బ్రాంచ్ లో చేరి నేనూ ఒక బ్లాగాట మొదలు పెడదాం అని ఒక తుంటరి అవిడియా వచ్చింది. కానీ ఏం రాయను ఎలా రాయను? మనమా అగ్న్యానులం, పోనీ కలాపోసన అన్నా లేకపాయె! విషయ పరిఙ్నానం శూన్యం !! మరేటి సెసేది ?? అని ఆలోచించగా చించగా ఎక్కువ సదవేస్తే వున్నమతి పోద్దని అర్థమయ్యి అంటే వున్న మందమతి పోయి ఎవరన్న మధుమతి వస్తుందేమో అని ముందస్తుగా అన్ని బ్లాగులు ఎడా పెడా చదివెయ్యాలని డిసైడ్ చేసి మళ్ళి బ్లాగ్లోకం లో పడి చదువుకుంటు పొయ్యా.

సదవంగా నాక్కూడా రాసేంత గ్న్యానం రాకపోయినా ఎవులన్న సెప్తే అర్థం సెసుకునే తెలివి అలవడింది. దాంతోపాటు బోల్డన్ని అనుమానాలు. అవన్ని ఎవడుతీరుస్తాడు ?? మరి పారేసుకున్న చోటనే వెతుక్కోమన్నారు కదా! అందుకే బ్లాగులు చదివి అర్థంకాని విషయాలన్ని బ్లాగుల్లోనే అడగాలి అని ఒక ఫ్లాష్ ఫ్లాష్ ఐడియా వచ్చింది. అలా మొదలైందే ఈ బ్లాగు.

పిల్ల బ్లాగరుని అని మరీ రాగింగ్ చెయ్యకండే. ఎమవుద్దో కూడల్లో సూత్తన్నారు గందా! గదేదో ఇరవైనాలుగ్గంటల హెల్ప్ లైన్ వుంది"ఠ" రాగింగు రాయుళ్ళ ఆట కట్టించడానికి. మనకసలే బాలక్రిష్ణ సినిమాలకు లైన్లో నిలబడి టికెట్లు సంపాదించిన అనుభవముంది ఆ హెల్ప్ లైన్లో నిలబడి మరీ మీకు తలా ఒక ప్రజారాజ్యం ఓ లోక్ సత్తా టికెట్లో ఇప్పిస్తా. ఆ తరవాత ఇన్ కం టాక్సులవాళ్ళనుంచి తప్పించుకోలేక చస్తారు. రాయడానికి కొత్తైనా చదవడానికి పాతే! త్రీ ఇయర్స్ ఇండస్ట్రి ఇక్కడ. మరి వీవెనన్న కూడల్లో లింకెట్టగానే నా ప్రశ్నలతొ మీ బుర్రలు తింటా!